JD News Vision ప్రతినిధి: సూర్య ప్రకాష్ శర్మ
విజయవాడ, ఆగస్టు 16:
అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ సిటీ లీగ్–2026లో విశాఖపట్నంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య (జూనియర్) కళాశాలకు చెందిన పి. నాగమణి సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి కళాశాలకు, కన్న తల్లి తండ్రులకూ విశాఖపట్నానికి గర్వకారణంగా నిలిచారు.

“పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ” అన్న సుమతీ శతక పద్యం చెప్పినట్లుగా, పిల్లలు సాధించిన విజయమే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. నాగమణి విజయం ఆమె తల్లిదండ్రులు పి. స్వాతి, పి. నారాయణరావులకు ఎంతో గర్వాన్ని, ఆనందాన్ని కలిగించింది.
మధ్యతరగతి కుటుంబానికి చెందినప్పటికీ తల్లిదండ్రులు నాగమణిని క్రీడల్లో ప్రోత్సహించారు. తల్లి స్వాతికి కూడా క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో తన కలను నెరవేర్చుకోలేకపోయారు. తన కుమార్తె స్వర్ణ పతకం సాధించడం ఆమెకు ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది.
నాగమణికి శ్రీకాకుళానికి చెందిన కోచ్ కె. వంశీ శిక్షణ అందించారు.
విజయవాడలోని పటమట స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. పలువురు క్రీడా ప్రముఖులు, అధికారులు కార్యక్రమానికి హాజరై విజేతలను అభినందించారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో విజేతలకు పతకాలు, బహుమతులు అందజేశారు.
నాగమణి సాధించిన ఈ స్వర్ణ విజయం డాక్టర్ లంకపల్లి బుల్లయ్య (జూనియర్) కళాశాలకు, విశాఖపట్నం క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచింది.
Jd News Vision